ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఓ గిరిజన యువకుడి పట్ల కొందరు యువకులు పైశాచికత్వగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ, నోట్లో మూత్రం పోసి చావబాదారు.. వదిలేయమని బతిమాలినా వినలేదు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ఈ అరాచకాన్ని మొబైల్‌లో చిత్రీకరించారు.. నెల క్రితం జరిగిన ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా బయటపడింది. నవీన్ అనే గిరిజన యువకుడు.. ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగేవారు. ఇద్దరూ జులాయిగా తిరుగుతూ నేరాల చేస్తుండేవారు.. వీళ్లపై దొంగతనాల కేసులున్నాయి. నవీన్ గతంలో పోలీసులకు దొరికిపోయి జైలుశిక్ష అనుభవించాడు. అంజి మాత్రం కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో నెల క్రితం రామాంజనేయులు నవీన్‌ను మద్యం తాగుదామని ఆహ్వానించాడు. ఒంగోలులోని కిమ్స్ వైద్యశాల వెనుక వైపునకు వెళ్లారు.. నవీన్ వెళ్లే సమయనికి అక్కడ రామాంజనేయులతో పాటుగా ఒంగోలు, వేటపాలేనికి చెందిన మొత్తం 9 మంది యువకులు ఉన్నారు. అందరూ అక్కడే కూర్చుని మద్యం సేవించారు. ఇంతలో అంజి పాత వివాదాన్ని మళ్లీ చర్చకు తీసుకొచ్చాడు. నవీన్‌తో వాగ్వాదానికి దిగాడు.
అక్కడున్న యువకులందరు కలిసి నవీన్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని బాధితుడు బతిమాలినా వదల్లేదు. అతడిని దారుణంగా కొట్టారు.. అంతటితో ఆగకుండా అతడి నోట్లో మూత్రం పోస్తూ తాగాలని బలవంతం చేశారు. వద్దని కాళ్లావేళ్లా పడినా కనికరించేలేదు.. మళ్లీ దాడి చేశారు. మరీ నీచంగా మర్మాంగాన్ని అతని నోట్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ఈ దారుణం మొత్తాన్ని మొబైల్‌లో రికార్డ్ చేశారు. నెల రోజుల క్రితం ఈ దారుణం జరిగింది.
ఆ తర్వాత బాధితుడు ఆస్పత్రిలో కోలుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదని చెబుతున్నారు. ఇంతలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రధాన నిందితుడు రామాంజనేయులు పరారీలో ఉండగా.. ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఈ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.