త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. జనసేన తమకు మిత్రపక్షంగా ఉందని, ఈ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై జనసేనతో కలిసి పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. పవన్‌కు ఎప్పుడు వీలుంటుందో తెలుసుకుని ఆయనతో సమావేశమవుతానని, పొత్తులపై కేంద్ర అధినాయకత్వానిదే తుది నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని పురందేశ్వరి స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని, రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు సమకూర్చిందన్నారు పురందేశ్వరి. జగన్ సర్కార్ నాలుగేళ్లల్లో రూ.75 వేల 501 కోట్ల అప్పులు చేసిందని, ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రం అప్పులు చేయలేదన్నారు. ఆర్ధిక వ్యవహారాల్లో ఏపీని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని, రాష్ట్రంలోని ఆర్ధిక పరిస్థితిని కేంద్ర ఆర్థికశాఖమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపైన కూడా రూ.8,300 కోట్లు అప్పు తెచ్చారని, అనధికార అప్పులే రూ.4 లక్షల కోట్లకుపైగా ఉందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం పరిధికి మించి అప్పులు చేసిందని, అనధికార అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి జగన్ సర్కార్ అప్పులు తీసుకొస్తుందని, కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అప్పులు పెట్టుకుని అభివృద్ధి ఎలా చేయగలరని ప్రశ్నించారు. అప్పులకు వడ్డీలు రూ.50 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని, ఆదాయంలో 40 శాతం వడ్డీలు చెల్లించడానికే ఖర్చు చేస్తే అభివృద్ది పనుల సంగతేంటి? అని ప్రశ్నించారు. ఏపీలో ఉన్నన్నీ కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలో లేవని, కోర్టులను కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఒకసారి సమావేశం జరగ్గా.. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మరోసారి ఎన్డీయేపక్షాల మీటింగ్ జరగనుంది.