పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలతో పాటు కార్యకర్తలు - నేతలకు భవిష్యత్తుకు గ్యారంటీ ఉండేలా చంద్రబాబు కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో మార్చుకునే మెకానిజం వ్యవస్థను నేతలకు అధినేత వివరించారు. బూత్ స్థాయి నుంచి ఇన్‌చార్జ్ వరకూ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునేలా కార్యాచరణను ప్రకటించారు. ప్రతీ ఇన్‌చార్జ్ పనితీరుపై రెండేసి సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెలా నివేదిక ఇచ్చే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతీ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు యాక్షన్ ప్లాన్‌ను కమిటీలు ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి బ్యాకాఫీస్ బృందంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్‌చార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ పనితీరును కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలో తప్పులు సరిదిద్దుకునేలా ప్రతినెలా నివేదికలు ఇవ్వనున్నాయి. బూత్ స్థాయి నుంచి ఇంఛార్జి స్థాయి ప్రతీ ఒక్కరి పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన ప్రాధాన్యత ఇచ్చి పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.