ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహయం కోసం 24 గంటలు 1070, 18004250101 ఈ స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. జిల్లాల్లో మండల స్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.