జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయన నార్త్ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో షాను కలుసుకున్నారు. ఇద్దరూ 25 నిమిషాలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జగన్ వ్యవహారంపై మంతనాలు సాగించినట్లు తెలిసింది. మంగళవారం ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే వచ్చిన పవన్.. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి అన్ని శక్తులు ఏకం కావాలన్నదే తమ లక్ష్యమని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పొత్తులు, జగన్ ప్రభుత్వం తీరుపై అమిత్ షాతో ఆయన చర్చించినట్లు సమాచారం. నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్న భవిష్యత్ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పవన్ ఆ తర్వాత ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్‌ను కలిశానని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై అభిపాయ్రాలను పంచుకున్నామని షా ట్విటర్‌లో తెలిపారు. బుధవారం ఉదయం పవన్.. బీజేపీ ఏపీ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ ఇంట్లో అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, జనసేనతో పొత్తులపై చర్చించినట్లు మురళీధరన్ ట్వీట్ చేశారు.