జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎన్డీయే మీటింగ్ వచ్చారని తెలిపారు. పవన్ చేగువేరా డ్రెస్ వేసుకొనేవారన్నారు. ఆయన లైబ్రరీలో కూడా వామపక్ష పుస్తకాలు ఉండేవని, చదివే వారని... తాము కూడా గతంలో దగ్గర అయ్యామని తెలిపారు. వైసీపీని ఓడించాలని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీతో కలిసి పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడించాలని అనుకుంటున్నారని చెప్పారు. ప్యాకేజీ పాచిపోయిన లడ్డుతో పవన్ కళ్యాణ్ పోల్చారన్నారు. టీడీపీ, బీజేపీ కలుస్తుందో లేదో తెలియదన్నారు. టీడీపీ వాళ్ళతో కలుస్తుందో కూడా తెలియదని.. చంద్రబాబు కూడా ఎక్కడ చెప్పలేదన్నారు. పవన్ కళ్యాణ్‌ను యువత నమ్మతోందని.. వారికి అన్యాయం చేయొద్దని అన్నారు. ‘‘నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినంత మాత్రాన నాకు ఏమి కాదు’’ అని అన్నారు. పవన్ కళ్యాణ్ సంధానకర్తగా వ్యవహరించొద్దని సూచించారు. విభజన హామీలు సహితం అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా పోయిందని, ప్యాకేజీ లేదని.. స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ దొంగ చేతికి ఇచ్చినా రూ.3 లక్షల కోట్లు వస్తాయని.. కానీ రూ.30 వేల కోట్లకు ఆదానికి ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇది అడిగితే జగన్ జైలుకు వెళ్తారంటూ నారాయణ వ్యాఖ్యలు చేశారు.