వైసీపీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25న విద్యాసంస్థల బంద్‌కు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల పెంపుదలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని పునరుద్ధరించాలని.. సంక్షేమ హాస్టల్స్‌ను ఆధునికరించి మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని ప్రణవ్ అన్నారు. అమ్మ ఒడి పథకం అందరు విద్యార్థులకు వర్తింపజేయాలన్నారు. హాస్టల్ విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ , పి హెచ్ డి విద్యార్థుల స్కాలర్ షిప్, మెస్ ఫీజులను పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణమే పెంచాలన్నారు. అద్దె భవనాల్లో నడుపుతున్న సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు సమకూర్చాలని తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను, కాలేజీలను నడుపుతూ విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకునే ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వ సాయాన్ని కొనసాగించాలన్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి చదువుకునే ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. మెగా డీఎస్సీ ని ప్రకటించాలని.. జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను తక్షణమే చేపట్టాలని ఎంవీ ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు.