మణిపూర్ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో సంచలనంగా మారిన వేళ.. రకరకాల విషయాలు బయటికి వస్తున్నాయి. బాధితుల్లో ఒకరైన మహిళ భర్త.. ఇండియన్ ఆర్మీలో పనిచేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసిన వేళ.. ఈ విషయం బయటికి రావడం సంచలనంగా మారింది. ఈ అమానవీయ ఘటనపై స్పందించిన బాధితురాలి భర్త, మాజీ సైనికుడు.. యుద్ధంలో దేశాన్ని రక్షించిన తాను.. భర్తగా తన భార్యను మాత్రం ఇలాంటి ఘటన నుంచి కాపాడుకోలేకపోయానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ మాజీ సైనికుడు భారత ఆర్మీలో పనిచేసి.. రిటైర్ అయినట్లు తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 1999 లో భారత్ - పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో తాను ఇండియన్ ఆర్మీలో పనిచేసినట్లు తెలిపాడు. ఆ సమయంలో శత్రు దేశం నుంచి భారతదేశాన్ని కాపాడినట్లు పేర్కొన్నాడు. దీంతోపాటు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో భాగంగా శ్రీలంకలోనూ పనిచేసినట్లు చెప్పాడు. ఇలా దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన తాను.. తన ఇంటిని, భార్యను, గ్రామాన్ని మాత్రం రక్షించుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన తనను ఎంతో బాధిస్తోందని.. కుంగుబాటుకు గురిచేస్తోందని కన్నీరు పెట్టుకున్నాడు.
మే 4 వ తేదీన తమ గ్రామంపై దాదాపు వెయ్యి మంది అల్లరి మూక దాడి చేసిందని.. చాలా ఇళ్లకు నిప్పు పెట్టిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇద్దరు మహిళలను అందరి ముందే.. బట్టలు విప్పించి ఊరేగించారని ఆపై గ్యాంగ్ రేప్ చేశారని తెలిపాడు. ఆ సమయంలో సంఘటనా స్థలంలోనే పోలీసులు ఉన్నా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వాపోయాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. భారత సైన్యంలో పనిచేసిన ఆ వ్యక్తి అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా సేవలందించినట్లు తెలుస్తోంది.