దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనలో బాధితురాలైన 21 ఏళ్ల మహిళ నేషనల్ మీడియా సంస్థకు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ రోజు జరిగిన అమానవీయ ఘటన గురించి చెప్పారు. కాపాడాలని పోలీసులను ఆశ్రయిస్తే వాళ్లే తమను ఆ ఆందోళన చేస్తున్న గుంపు వద్ద వదిలేశారని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో బయటికి వచ్చే వరకు కూడా ఆ దుర్మార్గమైన ఘటనను వీడియో తీసిన సంఘటన తనకు గానీ.. తన కుటుంబానికి గానీ తెలియదని తెలిపారు. ఆ అల్లరి మూకలో ఉన్న యువకులు తమపై అనాగరికంగా వ్యవహరించారని.. పట్టపగలే తనపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మే 3 వ తేదీన కుకీ తెగకు చెందిన వారు భారీగా ర్యాలీ తీయడంతో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ప్రారంభం అయ్యాయి. ఆ మరుసటి రోజు ఈ ఘటన జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. మెయితీ వర్గానికి చెందిన 800 నుంచి వెయ్యి మంది గుంపు తమ గ్రామంపై దాడి చేస్తున్నారన్న సమాచారంతో తాను, తన తండ్రి, సోదరుడితో కలిసి పారిపోయి అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు వివరించారు. తమతో మరో ఇద్దరు మహిళలు కూడా వచ్చినట్లు తెలిపారు. అయితే పోలీసులు తమను అక్కడి నుంచి స్టేషన్‌కు తీసుకెళ్లే సమయంలో మెయితీ వర్గానికి చెందిన గుంపు అడ్డుకుందని.. దాంతో పోలీసులు తమను వారికి అప్పగించారని వెల్లడించారు. వారు తమపై దాడి చేస్తుండగా.. అడ్డుకున్నందుకు తన తండ్రి, సోదరుడిని అక్కడికక్కడే కొట్టి చంపారని చెప్పారు.
ఇద్దరు పురుషులు చనిపోవడంతో మిగిలిన ముగ్గురు మహిళల్లో ఒక మహిళ తప్పించుకుందని.. అనంతరం తనతోపాటు మరో మహిళపై ఆ గుంపు అమానుషంగా ప్రవర్తించినట్లు వివరించారు. ఆ ఇద్దరు మహిళల్లో వయసులో చిన్న అయిన తనను పట్టపగలే బహిరంగంగా గ్యాంగ్ రేప్ చేశారని తెలిపారు. పోలీసులే తమను ఆ అల్లరి మూకకు అప్పగించారని తీవ్ర భావద్వేగానికి గురయ్యారు. తమను బట్టలు విప్పాలని వారు తీవ్ర బలవంతం చేశారని.. అనంతరం నగ్నంగా చేసి.. ఊరేగింపు చేశారని పేర్కొన్నారు. తమ ప్రైవేటు భాగాలపై చేతులు వేసి.. ఇష్టం వచ్చినట్లు చేశారని జరిగిన ఘోరాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత తనపై అత్యంత అమానవీయంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. అనంతరం ఆ అల్లరి మూక తమను అక్కడే వదిలేసి వెళ్లారని.. దీంతో తాము అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై మే 18 వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారని ఆ మహిళ పేర్కొన్నారు. అయినా నిందితులను పట్టుకోవడం గానీ.. అరెస్టులు చేయడం గానీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై గ్యాంగ్ రేప్ చేసిన వారిలో కొంత మందిని మాత్రమే తాను గుర్తుపట్టగలనని.. మిగితా వారు ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో తన సోదరుని స్నేహితుడు కూడా ఉన్నట్లు ఆమె తెలిపారు.
ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం బయటకు వచ్చేంత వరకు తనకు గానీ.. తన కుటుంబానికి గానీ ఈ వీడియో తీసినట్లు తెలియదని పేర్కొన్నారు. మణిపూర్‌లో చెలరేగుతున్న హింస కారణంగా ఇంటర్నెట్‌పై నిషేధం విధించారని అందుకే ఇంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త కూడా స్పందించారు. తాను భారత సైన్యంలో పనిచేశానని.. కార్గిల్ యుద్ధ సమయంలో పోరాటం చేసినట్లు చెప్పారు. ఆ అల్లరి మూక జంతువుల లాగే తన భార్య, మరో మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారని.. ఆయుధాలతో చంపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.