సహజ వనరుల కోసం భూమి లోపల 10,000 మీటర్లకు మరో భారీ రంధ్రాన్ని చైనా తవ్వుతోంది. ఈ ఏడాదిలో ఇలా భూమి లోపల 10 కిలోమీటర్ల లోతు వరకూ రంధ్రాన్ని తవ్వడం ఇది రెండోసారి. మే నెలలో షింజియాంగ్ ప్రాంతంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మకైన ప్రాంతంలో భారీ రంధ్రం తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా, సించువాన్ ప్రావిన్సుల్లోని షెండి చునుకే ప్రాంతంలో అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి 10,500 మీటర్ల లోతైన రంధ్రం తవ్వకాలు గురువారం మొదలైనట్టు చైనా అధికారిక మీడియా జన్హూ వెల్లడించింది. చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ చేపట్టిన ఈ తవ్వకాలు భూమి లోపల సహజ వాయువుల వెలికితీత కోసమని తెలుస్తోంది.
షింజియాంగ్ తవ్వకాల సమయంలో భూ అంతర్గత నిర్మాణం గురించి తెలుసుకోడానికి, డ్రిల్లింగ్ సాంకేతికతలను పరీక్షించడానికి అని అప్పట్లో పేర్కొంది. కానీ, ప్రస్తుతం జిన్హువా ప్రకారం అత్యంత లోతైన సహజ వాయువు నిల్వలను కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. ఆగ్నేయ చైనాలోని సించువాన్ ప్రావిన్సులు.. స్పైసీ ఫుడ్, అద్భుతమైన పర్వత దృశ్యాలు, పాండాలకు ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు, పెద్ద మొత్తంలో సహజ వాయువులు, ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి. అయితే, అక్కడి భూ అంతర్భాగ, వాతావరణ పరిస్థితుల కారణంగా చైనా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు మాత్రం వీటిని వెలికి తీయడంలో పరిమిత విజయాన్ని సాధించాయి.
విద్యుత్ కొరత, భౌగోళిక రాజకీయ విభేదాలు, ప్రపంచ ధరల అస్థిరత మధ్య దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించేలా చైనా ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో చమురు కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. కాగా, ఈ తవ్వకాలు భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకొంటూ కొనసాగనున్నాయి. ఇందులో అత్యంత సంక్లిష్టమైన దశలు కూడా ఉన్నాయి. భూమి లోపల క్రెటెషియస్ పొర వరకూ ఈ తవ్వకాలను చేపట్టనున్నారు. ఈ పొర వయస్సు దాదాపు 145 మిలియన్ సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకూ మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. దీన్ని ‘కోలా సూపర్ డీప్ బోర్ హోల్’గా పేర్కొంటారు. దీని లోతు 12,262 మీటర్లు (దాదాపు 40 వేల అడుగులు). ఈ బోర్‌ను 20 ఏళ్ల పాటు తవ్వగా.... 1989లో 12,262 మీటర్ల లోతుకు అది చేరుకొంది.