ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది.. ఏడేళ్ల కాల వ్యవధిలో బరువు తగ్గి ఔరా అనిపించారు. వీరంతా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని బరువు తగ్గారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన ఓ కుటుంబం అధిక బరువుతో ఇబ్బంది పడుతోంది. దీంతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్న కుటుంబంలోని ఓ వ్యక్తి మొదట బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఆ సర్జరీ వల్ల మంచి ఫలితాలు రావడంతో మిగతా కుటుంబసభ్యులు కూడా శస్త్ర చికిత్సకు చేయించుకోడానికి ముందుకొచ్చారు. ఇలా ఒకరి తరువాత ఒకరు.. మొత్తం తొమ్మిది మంది సర్జరీ చేయించుకున్నారు. తాజాగా అదే కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతి కూడా బరువు తగ్గించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకుంది.
సర్జరీకి ముందు కాలేజీ విద్యార్ధిని 120 కిలోల బరువు ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు. ముంబయిలోని భాటియా హాస్పిటల్‌లో ఈ చికిత్స తీసుకున్న అనంతరం ఆమె బరువు 101 కిలోలకు తగ్గిందని యువతి తల్లి వెల్లడించారు. ఇంకా కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఈ కుటుంబంలో సర్జరీ చేయించుకున్నవారిలో 60 ఏళ్ల నుంచి 13 ఏళ్ల మధ్య వయస్కులు ఉండటం గమనార్హం. తన పెద్ద కుమార్తె కూడా సర్జరీ చేయించుకుని 100 కిలోల నుంచి 63 కిలోలకు బరువు తగ్గినట్టు ఆమె
ఆ కుటుంబంలో సర్జరీ చేయించుకున్న రెండో వ్యక్తిని తానని ఆమె వెల్లడించారు. తన మేనల్లుడు 20 ఏళ్లకే 200 కిలోల బరువు పెరగడంతో అతడు సర్జరీ చేయించుకుని 30 కిలోల తగ్గాడు. దీంతో తనను స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా బేరియాట్రిక్ సర్జరీకి మొగ్గుచూపామని ఆమె తెలిపారు. వీరికి చికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ సంజయ్ బౌర్డే మాట్లాడుతూ.. సర్జరీ తర్వాత వాళ్లు వెనుదిరిగి చూసుకోలేదని అన్నారు. ఆ కుటుంబానికి చెందిన మొత్తం 13 మంది ఇప్పటి వరకూ సర్జరీ ద్వారా బరువు తగ్గారని, వీరిలో 60 ఏళ్ల నుంచి 13 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారని చెప్పారు. వీరిలో 11 మంది 100 కిలోలకుపైగా బరువుండగా.. బీఎంఐ 35కిపైనే ఉందన్నారు. వీరికి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ శాతం చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయని డాక్టర్ బౌర్డే వెల్లడించారు.