రాష్ట్రంలోని ప్రజలకు మీరు ఏం పరువు మిగిల్చారో చెప్పండి అంటూ సీఎం జగన్ ఉద్దేశించి టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. వాలంటీర్ల అంశంలో గత కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం పరువునష్టం కేసు వేయడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.
పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసు వేయడానికి ఆయన మీ పరువుకు నష్టం కలిగించే దారుణమైన వ్యాఖ్యలు ఏం చేశారు జగన్ మోహన్ రెడ్డి గారూ? అంటూ గంటా ప్రశ్నించారు. గడచిన నాలుగున్నరేళ్లలో ఈ రాష్ట్రంలోని ప్రజలకు మీరు ఏం పరువు మిగిల్చారో చెప్పండి జగన్ మోహన్ రెడ్డి గారూ అని నిలదీశారు. "రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితికి ప్రజలను తీసుకువచ్చినందుకు మీ మీద వేయాలి పరువునష్టం. ప్రత్యేకహోదా తెస్తామని ఢిల్లీ వెళ్లి తలదించుకుని ఏపీ ప్రజలను వంచనకు గురిచేసినందుకు మీపై వేయాలి పరువునష్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి తెలుగింటి ఆడపడుచులను దగా చేసినందుకు మీ మీద వేయాలి పరువునష్టం.
62 ఏళ్లుగా మచ్చలేని చరిత్ర ఉన్న మార్గదర్శి అంతా చట్టబద్ధంగానే ఉందని కోర్టు మీకు మొట్టికాయలు వేసినా... మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపనందుకు మార్గదర్శి కస్టమర్లు వేయాలి మీపై పరువునష్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.3 వేలకు పెంచుతామన్న మీ మాటలకు మోసపోయిన అవ్వాతాతలు, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న అవ్వాతాతలు వేయాలి మీపై పరువునష్టం.
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి మీరు మోసం చేసిన నిరుద్యోగులు వేయాలి మీపై పరువునష్టం. శ్రమనే పెట్టుబడిగా నమ్ముకుని జీవనం సాగిస్తూ, పెట్రోభారంతో వాపోతున్న ఆటో రిక్షా కార్మికులే వేయాలి మీపై పరువునష్టం.
ఇసుకను వ్యాపారంగా మార్చడంతో సరైన ఉపాధి దొరకని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వేయాలి మీపై పరువునష్టం. గెలిచిన తొలి సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పి, ఇంకా పూర్తిచేయకుండా రాష్ట్రానికి మీరు చేసిన ద్రోహానికి మీపై వేయాలి పరువునష్టం.
అమ్మఒడి పేరిట తల్లుల ఖాతాలకు రూ.15 వేలు వేస్తామని చెప్పి, దాన్ని రూ.13 వేలకు, ఇప్పుడు 9 వేలకు కుదించినందుకు... మోసపోయిన విద్యార్థుల తల్లులు వేయాలి మీపై పరువునష్టం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నందుకు ఉద్యోగులు మీపై వేయాలి పరువునష్టం. విశాఖకు రైల్వే జోన్ తెస్తామనరి ప్రగల్భాలు పలికి ఢిల్లీకి వెళ్లి కేసుల భయంతో మెడలు వంచిన మీపై రాష్ట్ర ప్రజలు వేయాలి పరువునష్టం.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చినందుకు మీపై వేయాలి పరువునష్టం. ఇలా అన్ని విధాలుగా రాష్ట్రాన్ని పతనంలోకి నెట్టారు. ఇప్పుడేమో వ్యవస్థనుల దుర్వినియోగం చేస్తూ ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని ప్రశ్నిస్తే పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసు వేయడానికి మీకు సిగ్గుగా అనిపించడంలేదా? మీ రాక్షస ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజుల దగ్గరపడ్డాయి" అంటూ గంటా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు.