రాయలసీమ డిక్లరేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమావేశానికి హాజరైన పురందేశ్వరి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని పురందేశ్వరి ధ్వజమెత్తారు. 14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు. సర్పంచ్‌లు చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. రాయలసీమలోని గుడ్రేవుల ప్రాజెక్టు, సిద్దేశ్వరం అలుగు చిరకాల కల అలాగే ఉందని పేర్కొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కేంద్ర ప్రభుత్వం రూ. 780 కోట్ల మేర బిల్లులు ఇచ్చిందని.. కానీ పనులు మాత్రం జరగలేదని పురందేశ్వరి చెప్పారు. కనీసం ప్రాజెక్టులు మరమ్మత్తులు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్టు వద్ద ఇసుక అక్రమ రవాణా వల్లే గేటు కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వకుండా నీటిని నిల్వ చేశారని ఫైరయ్యారు.
కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని, యువతని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. ఇక, వైసీపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంత యువత, రైతులు వలస వెళ్లి.. వేరే ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓర్వకల్లులో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌ను కేంద్రం పెడుతోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
రాయల్ కౌంటిలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కూడా ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుంచే ప్రారంభించారని.. ఇప్పుడు తన రాష్ట్ర పర్యటన కూడా సీమ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని పురందేశ్వరి తెలిపారు.