రాష్ట్రంలోని డ్యామ్‌ల వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయి కంటే తక్కువగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిఘా ఉంచిందని, ఇది పూర్తిగా అదుపులో ఉందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదివారం తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ అధికారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భాక్రా డ్యాం వద్ద నీటిమట్టం ఇంకా ప్రమాద స్థాయి కంటే తక్కువగానే ఉండడం చాలా సంతోషకరమైన విషయమని, అందువల్ల డ్యామ్ నుండి వెంటనే నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. భాక్రా డ్యామ్ ప్రమాదకర స్థాయి 1,680 అడుగులు కాగా, జూలై 23న డ్యామ్ వద్ద నీటిమట్టం 1,653 అడుగులుగా ఉందని భగవంత్ మాన్ తెలిపారు. నీటి మట్టం ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి గందరగోళం తలెత్తకుండా నీటి మట్టానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకోవాలని ఆయన అధికారులను కోరారు. రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయకపోవటం కూడా హర్షించదగ్గ విషయమని, దీని వల్ల నీటి మట్టం మరింత తగ్గుముఖం పడుతుందని ఆయన అన్నారు.