ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు ఇస్తామన్నా కార్డుదారులే తీసుకోవడం లేదన్నారు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. వారు తీసుకుంటామంటే జూన్, జులైల్లో ఇవ్వకుండా ఆపేసిన కందిపప్పు కోటాను ఆగస్టు నెల రేషన్‌తో కలిపి ఇస్తామని చెప్పారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో రేషన్ డీలర్లు, అధికారులతో సమావేశమయ్యారు. 322 షాపులు బియ్యం, 246 షాపులు కందిపప్పు సబ్సిడీ ధరలకు అమ్మకానికి పెట్టామని చెప్పారు మంత్రి.
కరోనాతో మరణించిన డీలర్లకు రూ.లక్ష చొప్పున సాయం, డీలర్లకు కమీషన్ పెంపు, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఇవ్వాల్సిన కమీషన్ బకాయిలు సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చేతిలో డబ్బుందని.. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా? అని ప్రశ్నించారు. ఏపీలో ధనికులు పెరిగారని.. పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి వివరించారు.
రేషన్ డీలర్ల డిమాండ్లను నెరవేర్చటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. డీలర్లు ప్రతిపాదించిన డిమాండ్లలో 90 శాతానికి పైగా అంగీకారం తెలిపామపిజజ డీలర్లకు కమీషన్ పెంచడానికి కృషి చేస్తామన్నారు. 2012 పేరుకుపోయిన అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం కమీషన్ బకాయిలను సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని.. గన్నీ బ్యాగ్‌లను డీలర్లే ఉంచుకునేలా సీఎం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేస్తానన్నారు కారుమూరి నాగేశ్వరరావు.
ఇంటింటికి రేషన్ వాహనాలు ఉన్నా సరే డీలర్లను తీసేయబోమన్నారు మంత్రి కారుమూరి. ఒకవేళ ఎక్కడైనా రేషన్ వాహనాలు నడవకపోతే డీలర్లతోనే నడిపిస్తామే తప్ప ఆపబోమని.. గోడౌన్ దగ్గరే షాపు ఉండేలా కట్టివ్వడానికి సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ గోడౌన్‌లను ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తామని.. తూకం వేసి బియ్యం రేషన్ డీలర్లకు ఇస్తున్నారన్నారు. కేరళ మాదిరిగా ఇన్స్యూరెన్స్, ఎల్ఓసీ ఇచ్చేలా సిద్ధం చేస్తున్నామన్నారు.
ఫోర్టిఫైడ్ బియ్యాన్ని న్యూట్రిషన్ విలువలతో ఇస్తున్నామన్నారు మంత్రి కారుమూరి. ఫోర్టిఫైడ్ రైస్ ప్లాస్టిక్‌లా కనిపిస్తుందనేది ఒక అపోహ మాత్రమేనని.. బీపీఎల్ లో ఉన్న డీలర్లందరికీ సదుపాయాలు వచ్చేలా చూస్తామన్నారు. బియ్యం బస్తాలు తిరిగి ఇచ్చేయడంపై సీఎంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి నాగేశ్వరరావు. రేషన్ కార్డులు ఉన్నవారికి సబ్సిడీపై మార్కెట్ ధరల కంటే 15–20 శాతం తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పును విక్రయించేలా ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలోని 26 జిల్లాల్లో తక్కువ ధరకు బీపీటీ, సూపర్ ఫైన్, ఫైన్ వెరైటీ బియ్యం విక్రయాలను ప్రారంభించారు. ఆయా జిల్లాల్లోని మార్కెట్ ధరల ప్రకారం జాయింట్ కలెక్టర్లు ఈ సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తారు.