ఆంధ్రప్రదేశ్‌లో పది ఎకరాలు కొనొచ్చని టీపీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదిలావుంటే గతంలోనూ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చంద్రబాబు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్ర ప్రదేశ్‌లో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపగా.. మరోసారి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్లు వేస్తే.. భూములు విలువ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మి హైదరాబాద్‌లో 4 ఎకరాలు కొనే వారని.. మరి ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి కారణం ఎవరంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
అయితే.. గతంలోనూ చంద్రబాబు భూముల రేట్లపై కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో చెప్పే క్రమంలో.. సీఎం కేసీఆర్‌తో పాటు మిగతా తెలంగాణ నాయకులు బాబు మాటలు ఉటంకిస్తే.. వాటిని ఏపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇక ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే.. విశాఖపట్నంలో ఒక ఎకరం భూమిని అమ్మితే.. తెలంగాణలో ఏకంగా 150 ఎకరాల స్థలం కొనొచ్చంటూ కౌంటర్ వేశారు. హైదరాబాద్ దాటితే.. తెలంగాణలో భూములకు ఎక్కడ విలువుందంటూ.. ఎద్దేవా చేశారు. కాగా.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఎలాంటి దుమారం లేపనున్నాయో చూడాలి.
మరోవైపు.. ఏపీ సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని దుస్థితిలో విద్యార్థులు ఉన్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. అమరావతి రైతులపై జగన్‍కు ఎందుకు కక్ష.. అంటూ నిలదీశారు. రాజధాని రైతుల భూమిని వేరొకరికి దానం చేసిన జగన్ దాన కర్ణుడా అంటూ ఎద్దేవా చేశారు. అంత దానం చేసే గుణమే ఉంటే జగన్ తన సొంత భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‍కు వ్యవసాయంపై అవగాహన లేదన్న చంద్రబాబు.. గోదావరి జిల్లాలు మొదలు రాయలసీమ వరకు ఒక్క రైతైనా బాగున్నాడా.. అంటూ నిలదీశారు. జగన్ పాలనలో పుష్కలంగా సాగవుతున్న ఏకైక పంట.. గంజాయి అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.