బెంగళూరు మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి సహా రాజధాని నగరం రూపురేఖలు మార్చేందుకు కర్ణాటక ప్రభుత్వం,బృహత్ బెంగళూరు మహానగర పాలికె సంయుక్తంగా ముందడుగు వేశాయి. ఇందుకు సంబంధించి సోమవారం వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. భవిష్యత్తులో నగరం ఎలా ఉండాలి, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, కూడళ్లు, శాటిలైట్ టౌన్‌లు ఎలా అభివృద్ధి చెయాలి అనే విషయాలపై డబ్ల్యూడీఓ సూచనలు చేసింది.
బెంగళూరు నగర అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహించే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. బీఎంఆర్డీఏ ప్రాంతాలలో శాటిలైట్ టౌన్‌లను అభివృద్ధికి డబ్ల్యూడీఓ సూచనలు చేస్తుందన్నారు. ఎందుకంటే పెద్ద ప్రయోగాలకు అవకాశం తక్కువ ఉందని, ఇక్కడ సంస్కరణాత్మక మార్పులు చేయలేమని అన్నారు. డబ్ల్యూడీఓ ప్రెసిడెంట్ డేవిడ్ కుసుమ, బీబీఎంసీ కమిషనర్ తుషార్ గిరినాథ్‌లు ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, బృహత్ బెంగళూరు మహానగర పాలికే లు డబ్ల్యూడీఓతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.. బెంగళూరుకు స్వంత చరిత్ర ఉంది. దీనిని గ్లోబల్ సిటీగా మార్చడానికి మేము కొత్త రూపాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం.. గతంలో పోటీపడినా బెంగళూరు నగరం ఎంపిక కాలేదు’ అని చెప్పారు.
బెంగళూరును డబ్ల్యూడీఓ ఎంపిక చేసిందని, నగర భవిష్యత్తు ఎలా ఉండాలి, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, రోడ్డు కూడళ్లు, శాటిలైట్ టౌన్‌లను ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయాలపై సూచనలు చేశారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డబ్ల్యూడీఓ ప్రధాన కార్యాలయం కెనడాలో ఉందని, రానున్న రోజుల్లో దాదాపు 200 నుంచి 300 మంది ఇంజినీర్లు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు.
బెంగళూరులో విజయవంతమైన తర్వాత కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆ సూచనలను అమలు చేసే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని శివకుమార్ స్పష్టం చేశారు. ‘నేను డబ్ల్యూడీఓ అధికారులకు సలహా ఇచ్చాను.. నగరంలో పెద్ద మార్పులు చేయలేమని వారిని అభ్యర్థించాను. వారు ఏమి చేయాలనుకుంటున్నారో అది బీఎంఆర్డీఏ ప్రాంతానికి విస్తరించాలి. మేము ఆ మేరకు ప్రణాళికలు వేయాలి’ అని ఆయన శివకుమారు చెప్పారు.
అయితే, గత నాలుగు దశాబ్దాల్లో బెంగళూరు నగరంలో నివాస ప్రాంతాలు 525 శాతం పెరిగిపోయాయి. ఒకనాడు గ్రీన్ సిటీగా పేరున్న నగరంలో ఇప్పుడు 78 శాతం వృక్ష జాతి అంతరించి, చల్లగా ఉండే వాతావరణం రికార్డు స్థాయి వేడికి పెరిగిందని పలు సర్వేలు హెచ్చరించాయి.