ఎన్నికల్లో తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఓ ఎన్నికల్లో ఓటర్లకు కిలో చొప్పున మటన్ పంచినా ఓటమి పాలైనట్లు గుర్తు చేసుకున్నారు. నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలిపారు.
ఇదే సందర్భంగా ఏం చేస్తే రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలుస్తారో కూడా నితిన్ గడ్కరీ వెల్లడించారు. కేవలం ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలు పంచితే విజయం సాధించరని పేర్కొన్నారు. అయితే తాను అలాంటివి నమ్మనని తెలిపారు. కానీ గతంలో ఒకసారి అటువంటి ప్రయోగం కూడా చేసి చూసినట్లు చెప్పారు. తన నియోజకవర్గంలోని ఓటర్లకు ఒక ఎన్నికలో ఒక్కొక్కరికీ కిలో చొప్పున మటన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లు వివరించారు. ఇలాంటి ఉచితాలు, తాయిలాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు.
ఇదే సమయంలో ప్రజల గురించి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు చాలా తెలివైన వారని.. ఎవరికి ఓటేయాలో వారికి తెలుసని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయ నాయకులు ముందు ప్రజల నమ్మకాన్ని సంపాదించాలని అన్నారు. ప్రజల నమ్మకం లేకుండా డబ్బులు, మద్యం పంచడం.. తాయిలాలు ఇవ్వడంతో లాభం లేదని చెప్పారు. బ్యానర్లు, పోస్టర్లపై ఖర్చు చేయాల్సిన కూడా అవసరం ఉండదని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా రాజకీయ నాయకులు ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం.. వారి ప్రేమను గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.