ఓ వ్యక్తి తన బైక్‌తో తొక్కించి ఎలుకను అతి క్రూరంగా చంపిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ చిన్న జీవిపైకి పదే పదే బైక్ ఎక్కించి, తన ప్రతాపం చూపించాడు. అత్యంత దారుణంగా ఆ ఎలుకను నలిపి చంపేశాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన నెటిజన్లు.. అతడి చర్యలపై మండిపడ్డారు. మూగ జీవిపై ఇంత కర్కశత్వమా? అని ఆవేదన వ్యక్తం చేసిన పలువురు.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడ్ని వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి శిక్షించాలని కోరారు. ఢిల్లీ శివారులోని నొయిడాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
ఆ ఎలుకను చంపిన వ్యక్తి నొయిడాలోని ‘ఖాన్ బిర్యానీ’ సెంటర్ యజమాని మతాలుబ్ అహ్మద్ కుమారుడు జైనులుద్దీన్‌గా పోలీసులు గుర్తించారు. వీడియో వైరల్ కావడంతో ఎక్కడ తనను పోలీసులు పట్టుకుంటారోనని నిందితుడు పరారయ్యాడు. చివరకు అతడి స్వగ్రామం యూపీలోని మామురలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని అరెస్ట్ చేసిన ఫోటోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఎలుకను హింసించి చంపినందుకు భలే శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్లతో సంతోషం వ్యక్తం చేశారు. నిందితుడి అరెస్ట్ కూడా వైరల్ అయింది. కానీ, పోలీసులు మాత్రం.. అతడ్ని ఎలుకను చంపినందుకు అరెస్ట్ చేయలేదని ట్విస్ట్ ఇచ్చారు.
దీనిపై పోలీసులు వివరణ ఇస్తూ ఎలుకను చంపినందుకు అతడిని అరెస్ట్ చేయలేదన్నారు. సెక్షన్ 151 కింద నమోదైన మరో కేసులో అతడిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. బిరియానీ సెంటర్‌లో కస్టమర్లతో డబ్బులు విషయమై అరెస్టయ్యాడని చెప్పారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తే.. జైనలుద్దీన్ మాత్రం వారిపైనే తిరగబడ్డాడు. దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 151 కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పరిస్థితి చేజారడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.