విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విపక్ష పార్టీలపై ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఒక లక్ష్యమంటూ లేని ముందుకెళ్లే విపక్షాలను నేను ఇంతవరకు చూడలేదు. పేరులో ఇండియా ఉంటే సరిపోదు.. ఈస్ట్ ఇండియా కంపెనీతోపాటు ఇండియన్ ముజాహిదీన్.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉంది’ అంటూ ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేసినట్టు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
బెంగళూరులో గతవారం జరిగిన విపక్షాల భేటీపై కూడా మోదీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ‘ఇండియా పేరుతో తమను తాము పొగుడుకుంటున్నారు. భారత జాతీయ కాంగ్రెస్. ఈస్ట్ ఇండియా కంపెనీ.. ఇండియన్ ముజాహిదీన్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇందులో కూడా ఇండియా ఉంది... ఇండియా అనే పేరును పెట్టుకున్నంత మాత్రాన ఏమీ ఒరిగిపోదు.. దేశం పేరును ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించలేరు’ అని ప్రధాని మాటలను ఉటంకిస్తూ రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
మణిపూర్ హింసాకాండపై ప్రధాని ప్రకటన చేయాలని గత మూడు రోజుల నుంచి విపక్ష పార్టీలు పార్లమెంట్‌ను స్తంభింపజేయడంతో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటమి, నిరాశ, నిస్సహాయంతో అలసిపోయిన ప్రతిపక్షాలకు మోదీని వ్యతిరేకించటం ఒకటే ఎజెండా పెట్టుకున్నాయని అభివర్ణించారు. ప్రతిపక్షంగా ఉండేందుకు వారు నిర్ణయించుకున్నారని వారి ప్రవర్తన తెలియజేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో బీజేపీ సులువుగా మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మణిపూర్‌పై వివాదంతో పార్లమెంట్‌లో కీలక చట్టాన్ని ప్రవేశపెట్టాలని భావించిన కేంద్రం వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందురోజు మణిపూర్ భయానక వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో గత గురువారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభలు పెద్దగా పని లేకుండానే పదే పదే వాయిదాపడుతూనే ఉన్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మణిపూర్ హింసపై మోదీ మొదటిసారి నోరు విప్పారు. దోషులను వదిలిపెట్టమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని.. మణిపూర్ ఆడబిడ్డలకు జరిగిన దానిని ఎప్పటికీ క్షమించలేమని ఆయన అన్నారు. అయితే, విపక్షాలు మాత్రం మోదీ ప్రకటనపై సంతృప్తి చెందలేదు. దీనిపై ఉభయ సభల్లోనూ ప్రధాని మాట్లాడాల్సిందేనని పట్టుబట్టాయి. సోమవారం రాత్రి పార్లమెంట్ ముందు మౌన దీక్ష కొనసాగించాయి.