పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమంలో పాక్ కొట్టుమిట్టాడుతోంది. అందినకాడికి అప్పులు చేస్తూ.. కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఐఎంఎఫ్ నుంచి 3 బిలియన్ డాలర్లు రుణసాయం అందుకుంది. తాజాగా, తన అనుంగు మిత్రుడు చైనా దగ్గర రుణం తీసుకునేందుకు సిద్ధమయ్యంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎదుటివాళ్లను దేహీ అని అభ్యర్ధించడం మానుకుని, మన సొంతకాళ్లపై నిలబడే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.
మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేసి స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరగా ఆర్ధిక సమస్యలతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌లో పరిస్థితులు దుర్బరంగా ఉన్నాయి. దీంతో పాక్ ప్రభుత్వం ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఐఎంఎఫ్ దగ్గర కొంత ఋణం తీసుకుంది. చైనా దగ్గర మరికొంత రుణం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చైనాకు 2.07 బిలియన్ డాలర్లు రుణపడిన పాక్.. తాజాగా మరో 600 మిలియన్ డాలర్లు రుణంగా తీసుకోందది. దీంతో కలిపి మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది.
ఎడాపెడా చేస్తున్న అప్పులతో జనం నెత్తిన మరో భారం పెరుగుతున్న దృష్ట్యా పాక్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ స్పందించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులు, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్థాన్ గర్విస్తోందని అన్నారు. ‘ఎన్నాళ్లు ఇలా పొరుగుదేశాల దగ్గర చిప్ప పట్టుకుని తిరుగుతాం.. ముందు మన చేతిలోని ఆ చిప్పను విసిరేయాలి.. రుణాల కోసం ఇతర దేశాల మీద మీద ఆధారపడటం మానేయాలి.. సొంత కాళ్ల మీద నిలబడి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
పాకిస్థాన్‌కు అల్లా ఆశీర్వాదాలు ఉన్నాయని, ప్రపంచంలోని ఏ శక్తి కూడా దేశ పురోగతిని ఆపలేదని ఉద్ఘాటించారు. దేశం ఒక తల్లి లాంటిదని, ప్రజలకు, దేశానికి మధ్య ఉన్న సంబంధం ప్రేమ, గౌరవమని అన్నారు. భద్రత, ఆర్థిక వ్యవస్థ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని, ఒకదానికొకటి అనివార్యమని ఆయన ఉద్ఘాటించారు. దేశానికి సేవచేయడానికి సైన్యం ఉందని, సైన్యానికి ఈ బలం ప్రజల నుంచి వచ్చిందని మునీర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం నుంచి పాకిస్థాన్‌ను గట్టెక్కించే వరకు సైన్యం విశ్రమించదని జనరల్ మునీర్ హామీ ఇచ్చారు.
మోడల్ ఫామ్ గురించి మాట్లాడుతూ.. దేశం త్వరలోనే వ్యవసాయ విప్లవాన్ని చూస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ‘చిన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి, హరిత కార్యక్రమాల పరిధిని విస్తరించడానికి ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా మోడల్ ఫామ్‌లను ఏర్పాటు చేస్తాం’ అని ఆయన తెలిపారు.