విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దశల వారి ఆందోళనలు చేపట్టనున్నట్టు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గంటా సత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు జి.ఎస్.రావు కల్యాణ మండపంలో బుధవారం నిర్వహిం చిన నిడదవోలు డివిజన్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. 1999 ఫిబ్రవరి ఒకటి నుంచి 2004 ఆగస్టు 31 మధ్య రిక్రూట్ అయిన ఉద్యోగులకు జీఏపీఎఫ్‌ను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అమలుచేయాలి. జేఎల్‌ఎం గ్రేడ్ 2 ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, కారుణ్య నియామకాలను అమలుచేయాలి. పెండింగ్ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి. పీఆర్‌సీ 2022ను వెంటనే అమలుచేయాలనే తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నట్టు తెలిపారు. ఈ నెల 27,28 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా, 31న స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు వినతిపత్రాలు అందజేత, ఆగస్టు 1న సర్కిల్ ఆఫీస్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ, 2,3 తేదీల్లో రిలే నిరాహారదీక్షలు, 4,5,7 తేదీల్లో వర్క్ టు రూల్, 8న విజయవాడ మహాసౌధ వద్ద ధర్నా, 9న డిపార్ట్‌మెంటల్ సిమ్స్ హాండింగ్ ఓవర్, ఆగస్టు 10వ తేదీన నిరవధక సమ్మె చేపడతామన్నారు.