ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ ,,,ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 06:37 PM

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకముందు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌.. జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌కు పుష్ఫగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ప్రమాణం చేసిన అనంతరం.. బాధ్యతల స్వీకరిస్తున్నట్లు పత్రాలపై సంతకాలు చేశారు. సీఎం జగన్‌ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌‌ను సత్కరించారు.


ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతిపక్షనేత చంద్రబాబు,హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు.. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. అనంతరం హై టీ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేను అందరూ కలిసి అభినందనలు తెలిపారు.


హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ది జమ్మూ కాశ్మీర్ కాగా.. 1964 ఏప్రిల్‌ 25న జన్మించారు. ఆయనకు అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా పేరుంది. 1989 అక్టోబరు 18న ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్‌ న్యాయవాదిగా హోదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్‌ టూ స్థానంలో కొనసాగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర కోటా నుంచి న్యాయమూర్తులెవరూ లేరు. కాబట్టి.. ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) గా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి ఇకపై నంబర్‌ 2గా కొనసాగుతారు. ధీరజ్‌సింగ్ కుటుంబంలో న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఆయన తండ్రి, సోదరుడు న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తీర్థసింగ్‌ ఠాకూర్‌ సోదరుడే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com