కడప జిల్లాలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ట్రాన్స్‌కో ఉద్యోగినిని పోలీసులు కాపాడారు. బద్వేలులోని మంగళవీధికి చెందిన సతీష్ బ్రహ్మంగారిమఠం మండలంలో ట్రాన్స్‌కో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.. సతీష్ మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులపై కోపంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సిద్దవటం మండలంలోని కనుమలోపల్లి వచ్చి రైలుపట్టాలపై పడుకున్నాడు.
ఈ విషయం తెలియడంతో ఆయన కుమారుడు రామ్‌కుమార్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. తన తండ్రి ప్రమాదంలో ఉన్నారని కాపాడాలని పోలీసులను కోరారు. ఆయన మొబైల్ నంబరు కూడా ఇవ్వగా.. దాని ఆధారంగా సతీష్ ఉండే లోకేషన్‌ను గుర్తించారు సిద్దవటం ఎస్సై తులసీ నాగప్రసాద్. వెంటనే తమ సిబ్బందితో రైలు పట్టాల దగ్గరకు చేరుకున్నారు.
అప్పటికే సతీష్ పట్టాలపై పడుకుని ఉన్నాడు.. పరుగున వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకుని, రక్షించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సతీష్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన సిద్దవటం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్, స్థానికులు అభినందించారు.