కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎమర్జెన్సీలో చనిపోయిన వ్యక్తి బతికాడంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఎమ్మిగనూరు మండలం మొగతి గ్రామానికి చెందిన పింజరి బాషా తన ఇంట్లో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు గురువారం ఉదయం 4 గంటల సమయంలో ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. అతడికి మూత్రపిండాల సమస్య ఉండటంతోపాటు తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు.
అతడిని న్యూరో సర్జరీ వైద్యులు పరీక్షించారు.. ఈసీజీ చేయగా ఫ్లాట్‌గా రావడంతో చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మరోవైపు అనస్థీషియా టెక్నీషియన్లు సీపీఆర్ చేయగా హార్ట్ బీటింగ్ రావడంతో ఏఎంసీలో చేర్చారు. ఇంతలోనే కొందరు చనిపోయిన వ్యక్తి బతికాడంటూ ప్రచారం చేశారు. బాధితుడి బంధువు సైతం అవునని చెప్పడంతో పెద్దఎత్తున ప్రచారం సాగింది.
వాస్తవానికి అతనికి బ్రెయిన్‌డెడ్ అయిందని.. వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా కొంత పల్స్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. మరోసారి ఈసీజీ పరీక్షలు చేసిన తర్వాత పింజరి బాషా చనిపోయినట్లు ధ్రువీకరించామని వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు డెడ్‌బాడీని అప్పగించారు. మొత్తానికి కొద్దిసేపు గందగరోళం కనిపించింది.