పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. శనివారం నగరంలో షెటిల్ పోటీలను మంత్రి ప్రారంభించి ఆపై షటిల్ ఆడారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వాళ్లు ఏం మాట్లాడుతారో పురంధేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. పురందేశ్వరీ విభజన హామీలపై పోరాడితే బాగుంటుందని హితవుపలికారు. ఇప్పుడు పడుతున్న కష్టం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని తీసుకుని పడితే ఉపయోగం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తక్కువ అని చెప్పారని గుర్తుచేశారు. నదుల అనుసంధానంపై ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నదులు అనుసంధానం కన్నా నిధులు అనుసంధానం చేయడంలో ఆసక్తి ఎక్కువ చూపారంటూ మంత్రి రోజా సెటైరికల్ కామెంట్స్ చేశారు.