అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలం తాళ్లూరు గ్రామ గిరిజనులు గోదావరి వరదల కారణంగా కొండలపై తలదాచుకుంటున్నారు. ఇతర గ్రామాల మాదిరిగా తమకు నచ్చినచోట పునరావాసం కల్పించేవరకూ గ్రామాన్ని వదలబోమని, ఎంతటి వరదనైనా కొండలపైకి ఎక్కి ఎదుర్కొంటామని చెబుతున్నారు. తాళ్లూరులో 110 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కొండమొదలు పంచాయతీలోని 11 గ్రామాల్లో ఇదొకటి. అన్ని గ్రామాల గిరిజనులకు వారు కోరుకున్న పునరావాస కేంద్రంలో నివాసాలు కేటాయించగా, తాళ్లూరు వాసులకు పెదభీంపల్లిలో పునరావాసకాలనీలో ఇళ్లు నిర్మించారు. రావిలంకలో పునరావాస ఇళ్లు కేటాయించాలని వీరు కోరుతున్నారు. వారి కోరికను అధికారులు పట్టించుకోకపోవడంతో గతేడాది వరదల్లో వీరంతా కొండెక్కి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అక్కడే తలదాచుకుంటున్నారు.