పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్ సభకు పాఠశాల విద్యార్థులను తరలించారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం మినహా ఇతర ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు పాఠశాల, కాలేజీ విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లవద్దని 2019లో హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. విద్యార్థుల తరలింపు కోసం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారా అని సీజే ప్రశ్నించగా.. దీనిపై ఎంఈవో ఉత్తర్వులు ఇచ్చారని న్యాయవాది పేర్కొన్నారు. విద్యార్థులతో నినాదాలు చేయించారని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని అన్నారు.