ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఏపీకి ఇచ్చిన విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం మంత్రి బొత్స మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షురాలిపై ప్రశ్నల వర్షం కురిపించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం పర్యటించిన మంత్రి బొత్స ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వదిలేసి రాష్ట్రం అప్పుల్లో ఉందని వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు. ఏపీలో అప్పుల గురించి మాట్లాడుతున్న పురంధేశ్వరి.. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ చేస్తున్న అప్పుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
పార్లమెంటులో బీజేపీ ఎంపీనే దేశంలో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని ప్రస్తావించారని మంత్రి బొత్స తెలిపారు. మరి మిగిలిన ఆరు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల గురించి ఎందుకు ప్రస్తావించరని నిలదీశారు. ఇక, రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి మీరిచ్చిన విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూడలేక ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం చేయడం సరికాదన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక, మన్యం జిల్లాలో ఉన్న నాలుగు స్థానాల్లో మళ్లీ వైసీపీనే విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. కాగా, దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని ఆమె ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.