జూన్ 23వ తేదీన సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి. సోమవారం మిగిలిన రెండు సచివాలయాల వద్ద క్యాంపులు కొనసాగుతాయని సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు.