టమాటా లోడుతో వెళ్తున్న లారీ మాయం కావడంతో ఆ వ్యాపారి గుండెలు బాదుకుంటున్నాడు. రూ. 21 లక్షల విలువైన 11 టన్నుల టమాటాలతో వెళ్తున్న లారీ కనిపించకుండా పోవడంతో ఆ వ్యాపారికి ఏం చేయాలో తోచక చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
కర్ణాటకలోని కోలార్ జిల్లా నుంచి మునిరెడ్డి అనే ఓ వ్యాపారికి చెందిన టమాటాల లోడుతో ఓ లారీ బయల్దేరింది. అయితే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీని మునిరెడ్డి అద్దెకు తీసుకున్నాడు. రూ. 21 లక్షల విలువైన 11 టన్నుల టమాటా బాక్కులతో ఆ లారీ కోలార్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు బయల్దేరింది. లారీ డ్రైవర్‌ను నిరంతరం ఫోన్‌లో మునిరెడ్డి సంప్రదిస్తూనే ఉన్నాడు. ఆ లారీకి జీపీఎస్ ట్రాకర్‌ను కూడా అమర్చారు. అయితే శనివారం రాత్రి ఆ లారీ రాజస్థాన్‌లోని భోపాల్‌లో టోల్‌గేట్ దాటినట్లు.. సదరు లారీ డ్రైవర్.. మునిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత నుంచి డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం మొదలైంది. ఆ లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ కూడా పనిచేయలేదు.
ఈ ఘటనతో టమాటాల లోడుతో వెళ్తున్న లారీకి ఏమైందోనని ఆందోళన చెందిన మునిరెడ్డి.. కోలార్ పోలీసులను ఆశ్రయించాడు. 15 కిలోల బరువున్న ఒక్కో బాక్సును రూ.2000 నుంచి రూ. 2150 ధర పెట్టి కొనుగోలు చేసినట్లు మునిరెడ్డి వివరించాడు. మొత్తం 11 టన్నులకు రూ. 21 లక్షలు చెల్లించానని వాపోయాడు. మునిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. టమాటాల లోడుతో వెళ్తున్న లారీకి ఏదైనా ప్రమాదం జరిగిందా లేక మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడం వల్ల డ్రైవర్ ఫోన్ కలవడం లేదా అని విచారణ జరుపుతున్నారు. దీంతోపాటు లారీని ఎవరైనా అడ్డగించి హైజాక్ చేశారా లేక డ్రైవర్ ఆ టమాటా లోడుతో కలిసి పారిపోయాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు కోలార్ పోలీసులు తెలిపారు. భారీగా ఖర్చుపెట్టి టమాటాలు కొనుగోలు చేస్తే ట్రక్కు మాయం కావడంతో ఆ వ్యాపారి లబోదిబోమంటున్నాడు.