ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విసిరిన ఛాలెంజ్‌లకు యువతతోపాటు పెద్దవారు కూడా పోటీ పడి ముందుకు వస్తున్నారు. అయితే తమ వల్ల కాని కొన్ని సాహసాలకు పోయి కొంత మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. మరికొంత మంది ఆరోగ్యం విషమించి ఆస్పత్రుల్లో చేరిన వారు ఉన్నారు. సేమ్ టూ సేమ్ ఇలాగే ఓ టిక్‌టాకర్.. ఫిట్‌నెస్ ఛాలెంజ్ పాటించి.. చావు అంచుల వరకు వెళ్లింది. చివరికి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంది. డాక్టర్ వద్దని చెప్పినా వినకుండా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను కొనసాగిస్తానని చెబుతోంది. ఇంతకీ ఈ ఛాలెంజ్ ఏంటంటే.. 75 రోజుల పాటు రోజూ 4 లీటర్ల నీటిని తాగాలి. దీనికి 75 హార్డ్ అని పేరు కూడా పెట్టారు. ఈ 75 హార్డ్ ఛాలెంజ్‌లో నీళ్లు తాగడమే కాకుండా ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ 75 హార్డ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కెనడాకు చెందిన ఓ టిక్‌టాకర్ మిచెల్ ఫెయిర్‌బర్న్ చివరికి ఆస్పత్రిలో చేరింది. 75 రోజుల ఛాలెంజ్‌లో భాగంగా 12 రోజుల పాటు రోజుకు 4 లీటర్ల నీటిని తాగింది. దీంతో ఆస్పత్రి పాలైంది. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమెకు తీవ్రమైన సోడియం లోపం ఉందని తెలిపారు. మోతాదుకు మించి నీళ్లు బాగా తాగడంతో ఇలా అనారోగ్యానికి గురైందని చెప్పారు. కొన్ని రోజులపాటు రోజుకు కేవలం అర లీటర్ నీరు మాత్రమే తాగాలని సూచించారు. ఇలాంటి తీవ్ర సోడియం లోపానికి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.
అయితే డాక్టర్ల మాట వినని మిచెల్ ఫెయిర్‌బర్న్.. తన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను కొనసాగిస్తానని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆమె ఒక వీడియో కూడా విడుదల చేసింది. తనకు వాటర్ పాయిజనింగ్ అయిందని పేర్కొంది. తాను మొదట 12 రోజులపాటు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న తర్వాత తనకు అనారోగ్యం ఏర్పడిందని వెల్లడించింది. తనకు ఒంట్లో బాగాలేదని.. రాత్రంతా నిద్ర లేకుండా గడిపానని తెలిపింది. తరచూ బాత్రూంకు వెళ్లానని.. ఏం తినకుండా తీవ్రంగా నీరసించినట్లు వివరించింది. అయితే ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని.. ఛాలెంజ్ కొనసాగిస్తానని స్పష్టం చేసింది.
ఈ 75 హార్డ్ ఛాలెంజ్‌లో భాగంగా వివిధ రకాల పనులు చేయాల్సి ఉంటుంది. రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి. రోజుకు రెండుసార్లు 45 నిమిషాల పాటు వర్కౌట్లు చేయాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు. తప్పనిసరిగా డైట్ పాటించాలి. రోజూ 10 పేజీల పుస్తకం చదవాలి. వీటన్నింటికి సంబంధించిన ఫొటోలను తీసి పంపాలి. ఈ ఛాలెంజ్‌ను మొట్ట మొదటిసారిగా ఓ కంపెనీ సీఈఓ, పోడ్‌కాస్టర్ అయిన ఆండీ ఫ్రిసెల్లా అనే యూట్యూబర్ ప్రారంభించారు. ఫిట్‌నెస్‌కు సంబంధించిందని తెలియడంతో ఈ 75 హార్డ్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు చాలామంది ముందుకువచ్చారు. అయితే ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు ముందుగా డాక్టర్లను సంప్రదించాలని వెబ్‌సైట్లో స్పష్టంగా రాసి ఉంది. తమ శరీరాలకు ఈ ఛాలెంజ్ ఎలాంటి హానీ చేయదని భావించినప్పుడే ప్రారంభించాలని తెలిపారు. అయినప్పటికీ మిచెల్ ఫెయిర్‌బర్న్ అవేమీ పట్టించుకోకుండా ఇలా చేయడంతో అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైంది.