మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల సవరణ బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఖాయిలా పడిన కోఆపరేటివ్ సొసైటీలకు పునరుజ్జీవం కల్పించేదుకు కోఆపరేటివ్ పునరావాస, పునర్నిర్మాణ, అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అయితే దీనికోసం బడ్జెట్ గ్రాంట్ చేయడం లేదు. లాభాల్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీల లాభాల నుంచి కొంత మొత్తం ఈ నిధికి జమ చేసేలా బిల్లులో నిబంధన రూపొందించారు. ఈ నిధి సక్రమ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన యంత్రాంగానికి రూపకల్పన చేయాలి. బోర్డును ఏర్పాటు చేసి ఖాయిలా పడిన సొసైటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాలి. పునరావాసం, పునర్నిర్మాణం, అభివృద్ధికి నిజంగా అర్హులైన సొసైటీలను గుర్తించి వాటికి మాత్రమే ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.