హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన హింసాకాండపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం దేశంలో విద్వేష మంటలను వ్యాపిస్తోందని ఆరోపించారు. మణిపూర్ తర్వాత డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వైఫల్యానికి హర్యానాలో జరిగిన హింస మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. మణిపూర్ నుంచి హర్యానా వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు మండుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ అధినేత అన్నారు. యుపిలోని బరేలీలో కూడా అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నిందని, బిజెపి ప్రభుత్వం అల్లర్లను ప్రేరేపించి, ఆ తర్వాత అధికారులను శిక్షిస్తుందని ఆయన అన్నారు. దేశ ప్రజలకు, ముఖ్యంగా హర్యానా ప్రజలకు శాంతి, సామరస్యాన్ని కాపాడాలని ఎస్పీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి రాజకీయ కుట్రలు, అపోహలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి సోదరభావాన్ని కాపాడుకోవాలని అన్నారు.