వచ్చే ఐదేళ్లలో భారత్‌లో పోలార్ రీసెర్చ్ నౌకను సిద్ధం చేస్తామని భూవిజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. ఆర్కిటిక్, ఆంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ మూడు శాస్త్ర పరిశోధన కేంద్రాలను నెలకొల్పినప్పటికీ పదేళ్లుగా పోలార్ రీసెర్చ్ నౌక (ఐస్ బ్రేకర్ నౌక) నిర్మాణంలో ఎందుకు విఫలమయ్యామని వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిస్తూ.. ఐస్ బ్రేకర్ నౌక నిర్మాణంలో ఎదురైన ఆటంకాలు, అవాంతరాలను సుదీర్ఘంగా వివరించారు. భారతి, మైత్రి, హిమాద్రి పేరిట ఉత్తర, దక్షిణ ధృవాలలో భారత్ మూడు శాస్త్ర పరిశోధ కేంద్రాలను నెలకొల్పింది. ఈ కేంద్రాలకు నిరంతర రాకపోకలు సాగించడానికి ఐస్ బ్రేకర్ నౌక చాలా అవసరం. ఉత్తర, దక్షిణ ధృవాలలో నెలకొల్పిన ఈ రీసెర్చ్ స్టేషన్లు వాతావరణ మార్పులపై విస్త్రత శాస్త్ర పరిశోధనలు జరుపుతున్న నేపథ్యంలో పలు కారణాలరీత్యా ఐస్ బ్రేకర్ నౌకను సమకూర్చుకోవడం కీలకంగా మారిందని కేంద్రమంత్రి చెప్పారు. ఈ నౌకను సకాలంలో సమకూర్చుకోలేకపోవడం తనకూ బాధాకరంగా ఉందని అన్నారు.