తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపుతున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. త్వరలో రీఫండ్‌ను ట్రాక్ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామన్నారు. స్పీడ్ పోస్టు చేసినపుడు ఎలా కవర్‌ను ట్రాక్ చేయొచ్చో అదే తరహాలో రీఫండ్ సొమ్ము సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. తిరుమలలో యుపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేస్తున్నట్లు తెలిపారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 5 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్ డిపాజిట్ మొత్తం జమ చేస్తున్నామన్నారు. ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిల్స్ పంపుతున్నారన్నారు.
భక్తులు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ కాకపోతేనే సంప్రదించాలని కోరారు ధర్మారెడ్డి. రీఫండ్ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నారన్నారు. ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుంచి 5 రోజులు వేచి ఉండడం లేదని వివరించారు. మరికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని.. వెరిఫికేషన్ కోడ్ సబ్మిట్ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్ జనరేట్ కావడం లేదని చెప్పారు.
ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయన్నారు. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారన్నారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయన్నారు. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించిందన్నారు.
సీఆర్వోలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు జూలై 19వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఎస్ఎంఎస్ ద్వారా పేలింక్ పంపుతున్నామన్నారు. భక్తులు తిరిగి కౌంటర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్, యుపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చన్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుచేస్తామన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుండి పుష్కరిణిని మూసివేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల ముందు ఈ పనులు చేయడం ఆనవాయితీగా ఉందన్నారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని.. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటుచేశామన్నారు. టీటీడీ విద్యా విభాగం ఆధ్వర్యంలో తిరుమల ఘాట్ రోడ్లు, నడకమార్గాల్లో.. ఆగస్టు 12వ తేదీన శుద్ధ తిరుమల-సుందర తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
తిరుపతిలోని అన్ని టీటీడీ కళాశాలలకు చెందిన ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తిరుమల పవిత్రతను, పరిశుభ్రతను కాపాడడానికి విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. మొదటి విడతగా ఈ ఏడాది మే 13న ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. తిరుమల-తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లోను, నడకమార్గాల్లోను ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్లలోనే భక్తులు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేసి తిరుమలలో పచ్చదనాన్ని, పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 25న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారు. జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 23.23 లక్షలు కాగా.. హుండీ కానుకలు - రూ.129.08 కోట్లు వచ్చాయని ఈవో తెలిపారు. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.10 కోట్లు కాగా.. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 56.68 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య - 9.74 లక్షలుగా ఉందన్నారు ఈవో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa