వచ్చే ఎన్నికలకు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేయడంపై దృష్టి పెట్టారు. ఎన్నికలకు చాలా నెలల టైమ్ ఉన్నా.. ఇప్పుడు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తున్నారు. ఇటీవల పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేరును అధికారికంగా ప్రకటించగా.. తాజాగా మరో అభ్యర్థి పేరును వెల్లడించారు.
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిగా స్థానిక జర్నలిస్ట్ మురళీ మోహన్ పేరును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మురళీ మోహన్ పోటీ చేస్తారని, ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. మురళీ మోహన్ మంచి వ్యక్తి అని, ఆయనను ఆదరించాలని కోరారు. మురళీ మోహన్ సరైన అభ్యర్థి అని, ఆయనను అందరూ ఆమోదించారని శ్రేణులకు తెలిపారు.
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పూతలపట్టు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేదు. 2009 నుంచి 2014 ఎన్నికల వరకు ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎల్.లలిత కుమారి పోటీ చేసి మూడసార్లు వరుసగా ఓటమి పాలయ్యారు. మరోసారి ఆమెను పోటీలోకి దింపితే గెలవడం కష్టమని భావించిన చంద్రబాబు.. ఈ సారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని భావించారు. అందులో భాగంగా స్థానిక ప్రాంతంలో జర్నలిస్టుగా పేరు పొంది, అందరితో పరిచయాలు ఉన్న మురళీ మోహన్‌ను తెరపైకి వచ్చారు.
మురళీ మోహన్‌కు టీడీపీ టికెట్ వస్తుందనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. చంద్రబాబు ఫైనల్ కూడా చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు స్వయంగా ప్రకటించి నియోజకవర్గ పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేసింది. దీంతో ఈ సారి ఎలాగైనా వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి పూతలపట్టులో టీడీపీ జెండా ఎగురవేయాలని చంద్రబాబు వ్యూహరచలు చేస్తున్నారు. దీంతో పలువురు నేతల పేర్లను పరిశీలించారు. చివరికి నియోజకవర్గవ్యాప్తంగా పేరున్న జర్నలిస్ట్ మురళీ మోహన్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించారు.
మురళీ మోహన్‌ది పూతలపట్టు మండంలోని గొడుగుచింత గ్రామం కాగా.. తిరుపతి కేంద్రంగా ఓ టీవీ ఛానెల్‌లో పనిచేస్తున్నారు. గతంలో ఆయన టీడీపీలో చేరగా.. ఇటీవల నియోజకవర్గ ఇంచార్జ్‌గా చంద్రబాబు నియమించారు. మాజీ మంత్రి అమర్ నాథ్‌తో పాటు జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో ఆయనకు ఎప్పటినుంచో మంచి పరిచయాలు ఉన్నారు. ఆ పరిచయాల కారణంతోనే టీడీపీలో చేరారు.