ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలియుగ కర్ణుడు ,,,స్కూల్ కోసం 5 ఎకరాల భూమి దానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 06, 2023, 03:58 PM

ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం స్థలం వేలల్లో పలుకుంది. సామాన్యులకు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజుల్లో తలకు మించిన భారమవుతోంది. కొద్దిపాటి స్థలాల కోసం పేగు తెంచుకొని పుట్టిన సొంత అన్నదమ్ములనైనా దూరం పెట్టే రోజులివి. రక్త సంబంధం కంటే ఆస్తిపాస్తులకే విలువ ఇచ్చే రోజులివి. ఆస్తుల కోసం కుటుంబ సభ్యులను సైతం హత్య చేసిన వారి గురించి ప్రతి రోజూ వింటున్నాం. ఇక భూ తగాదాలు గురించి అయితే కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి గ్రామంలోనూ అంగుళం భూమి దగ్గర కూడా గొడవలు జరుగుతుండడం, ఈ గొడవలు రక్త పాతానికి కూడా దారి తీస్తుండటం చూస్తూనే ఉన్నాం. అలాంటిది తనపేరిట ఉన్న భూమిని ఊరిలోని బడి కొరకు దానమిచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు ఓ పెద్దాయన.


అనంతరపురం జిల్లా కల్యాణదుర్గం నియోవజర్గంలోని కుందర్పి గ్రామానికి ప్రభుత్వం ఇటీవల గురుకుల స్కూల్‌ను మంజూరు చేసింది. అయితే స్కూల్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలం గ్రామంలో అందుబాటులోలేదు. దీంతో స్థల సేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది. విషయం తెలుసుకున్న గ్రామానికే చెందిన జిన్నా ఓబులేసు స్కూల్ నిర్మాణానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. తన పేరిట ఉన్న ఐదెకరాల భూమిని గురుకుల పాఠశాల నిర్మాణానికి ఇస్తానని చెప్పాడు. పిల్లల భవిష్యత్తు కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఓబులేసు తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబసభ్యులు కూడా సమర్థించారు. ఈ మేరకు భార్యతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి భూమికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందించారు. భావి తరాల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఓబులేసు తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామస్తులు, చుట్టుపక్కల వారితో పాటు అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దాయని ఎంత మంచి మనసు అని కొనియాడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com