ప్రజా యుద్దనౌక, గాయకుడు గద్దర్ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు సంతాపం ప్రకటించిన జగన్.. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ మెసేజ్ ఇచ్చారు. గద్దర్‌కు తెలుగుజాతి మొత్తం సెల్యూట్ చేస్తుందని, ఆయన మరణం ఊహించలేనిదని వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడూ సామాజిక న్యాయం కోసమే పనిచేశారని, ఆయన పాట సామాజిక సంస్కరణ పాట అని కొనియాడారు.
బడుగు, బలహీన వర్గాల విప్లప స్పూర్తి గద్దర్ అని, ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని జగన్ తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు అందరం బాసటగా నిలుద్దామని చెప్పారు. గద్దర్ మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. గద్దర్ మృతితో ప్రశ్నించే గొంతు మూగబోయిందని, పౌరహక్కుల్లో గద్దర పాత్ర మురవలేదని చంద్రబాబు చెప్పారు. ఇక గాంధీ భవన్‌లో గద్దర్‌కు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు కుమార్ రావ్, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్, ఇతర పార్టీ నేతలు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గుండెపోటుతో అమీర్‌పేట్‌లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ ఆదివారం మరణించారు. ఈ మేరకు అపోలో ఆస్పత్రి బృందం బులెటిన్ విడుదల చేసింది. జులై 20న ఆయన హాస్పిటల్‌లో చేరగా.. ఆగస్టు 3న బైపాస్ సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను ఆయన ఉత్తేజపరిచారు. తన పాటలతో ప్రజలను ఉద్యమం వైపు నడిపించారు.
1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ పోరాడారు. అలాగే నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరగ్గా.. ఆయనకు బుల్లెట్లు తగిలాయి. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలు తెలంగాణ ఉద్యమానిక ఊపు తీసుకురాగా.. నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డు లభించగా.. ఆయన అవార్డును తిరస్కరించారు. నిజామాబాద్, హైదరాబాద్‌లో గద్దర్ విద్యాభాస్యం సాగింది. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేయగా.. 1985లో జననాట్య మండలిలో చేరారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో చేరి విప్లవ సాహిత్యాన్ని ప్రచారం చేశారు.