ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడే ఉందని వైయస్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ..... రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉన్నందునే ఈ బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని 239ఏఏ అధికరణం కింద పేర్కొన్న మూడు సబ్ క్లాజ్లు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించే అధికారం పార్లమెంట్‌కు కట్టబెట్టిందని అన్నారు. అలాగే ఢిల్లీ సర్వీసులకు సంబంధించి పార్లమెంట్ చట్టాలు చేయవచ్చున్నా అన్న అంశంపై సుప్రీం కోర్టు జారీ చేసిన విస్పష్టమైన ఆదేశాలను ఆయన ఉదహరిస్తూ సర్వీసులపై సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉండేలా చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. ఇది నిర్వివాదమైన అంశం. న్యాయపరంగా కూడా ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని ఆయన అన్నారు.