చంద్రబాబు చెప్పిన వివరాలు నమ్మొద్దని, ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ప్రాజెక్టు వద్దకు వచ్చానని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారపక్షంపై విరుచుకుపడగా, ఇవాళ అంబటి రాంబాబు కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నాడు-నేడు పేరిట ఫొటో గ్యాలరీ ద్వారా మంత్రి అంబటి వివరణ ఇచ్చారు. 2019 నాటికి పోలవరం ఎలా ఉంది... ఇప్పుడు ఎలా ఉంది? అనే విషయాలను ఫొటోల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. పోలవరం స్పిల్ వే, కాంక్రీట్ డ్యామ్, అప్రోచ్ చానల్ పనుల పురోగతిపై వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నిన్న అబద్ధాలు చెప్పారని అన్నారు. చంద్రబాబు చెప్పిన వివరాలు నమ్మొద్దని, ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ప్రాజెక్టు వద్దకు వచ్చానని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. గైడ్ బండ్ కుంగడం వల్ల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. గైడ్ బండ్ కుంగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గైడ్ బండ్ కు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేయిస్తామని అంబటి పేర్కొన్నారు. స్పిల్ చానల్ దెబ్బతినకూడదనే, డిజైన్ లో లేకపోయినా గైడ్ బండ్ నిర్మించడం జరిగిందని వివరణ ఇచ్చారు.