తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, ప్రభుత్వం, మంత్రుల పనితీరుపై అధికార పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ఆరు జిల్లాల కాంగ్రెస్ శాసనసభ్యులతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన వరుసగా రెండో రోజు కూడా రాయచూర్, విజయపుర, కొప్పల్, బెళగావి, హావేరి, కలబురగి జిల్లాల ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యారు. సోమవారం ఆయన తుమకూరు, యాద్గిర్, చిత్రదుర్గ, బాగల్‌కోట్, బళ్లారి, ధార్వాడ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అధికార, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు, ఎన్నికల ముందు స్థానికంగా ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలు మినహా మిగిలిన హామీలను నెరవేర్చడంపై సిద్ధరామయ్యతో చర్చించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, కొందరు మంత్రుల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాదాపు 30 మంది శాసనసభ్యులు ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, పార్టీ నాయకత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.