డిగ్రీలు పూర్తిచేసిన ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన తండ్రీకొడుకులు రూ.లక్షలు దోచేశారంటూ ఇద్దరు బాధితులు పోలీసు స్పందనలో వాపోయారు.వివరాల్లోకి వెళ్ళితే... నెల్లూరు, ముత్తుకూరు ప్రాంతానికి చెందిన మహేష్, సూళ్లూరుపేట నియోజకవర్గం మావిళ్లపాడుకి చెందిన మునిరాజులు స్నేహితులు. సన్నిహితుల ద్వారా తాడేపల్లిగూడెంకు చెందిన ఇగ్బాల్‌బాషా, ఆరీఫ్‌బాషాల గురించి తెలుసుకున్నారు. అనంతరం 2022లో వారు విజయవాడలోని ఓ లాడ్జిలో వారిని కలిశారు. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని టీటీఈ, టీసీ పోస్టులు సిద్ధంగా ఉన్నాయని, అయితే డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని వారు నమ్మబలికారు. ముందుగా నగదంతా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతానికి రూ.2లక్షలు చెల్లిస్తే మీరు రైల్వేపరీక్షలో పాసై అయ్యేటట్లు చేస్తామన్నారు. దీంతో ఆ నిరుద్యోగులు ముందుగా రూ.2లక్షలు చెల్లించారు. ఈ తరువాత కొద్దిరోజులకే అసలు పోటీపరీక్షకు హాజరు కాకుండానే, ఉత్తీర్ణత సాధించినట్లు సర్కారీ రిజల్ట్ డాట్‌కమ్‌లో ఫలితాలు చూపించారు. దీంతో వారు తమకు ఉద్యోగం వచ్చేసినట్లేనని మురిసిపోయి వారు అడిగినట్లుగా మరో రూ.8లక్షలు చెల్లిస్తారు.2022 మార్చిలో మీరు ఢిల్లీ వెళ్లాలని చెప్పడంతో ఆ ఇద్దరు నిరుద్యోగులు బయలుదేరారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫారమ్‌లపై ఉన్న రైళ్లను ఎక్కించి రైలులో ఇన్ని బోగీలు ఉంటాయి, ఇన్ని సీట్లు ఉంటాయి, రైలులో ప్రయాణికుడు టికెట్ లేకుండా ఎక్కిన సమయంలో ఎన్ని కిలోమీటర్లకు ఎంత ఫైన్ వేయాలి... అంటూ పలు అంశాలపై ప్రాక్టికల్స్ పేరుతో మోసగాళ్లు వారికి శిక్షణ ఇచ్చారు. అనంతరం థియరీ తరగతులని చెప్పి ఢిల్లీలోని ఓ కార్యాలయంలో 30 మంది బ్యాచ్‌తోపాటు ఈ ఇద్దరికి కూడా శిక్షణ ఇచ్చారు. నెల గడిచాక శిక్షణ సమయంలో జీతం అంటూ బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.15వేలకుపైగా జీతం పడింది. ఆ నగదుకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను బాధితులు పరిశీలించగా, ఇండియన్ నార్త్ శ్యాలరీ అని ఉండటంతో ఉద్యోగం ఖాయమని సంబరపడ్డారు. ఇక మన ప్రాంతంలో పోస్టింగే తరువాయి అంటూ మరోమారు మోసగాళ్లు అడిగినట్లుగా రూ.15 లక్షలు చెల్లించారు. ఈ క్రమంలో 45 రోజులు శిక్షణ పూర్తయ్యాక ఇక్కడి పరిస్థితులు బాగాలేవు... సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మీకు శిక్షణ ఇక్కడ కాదు చెన్నైకు మారుస్తున్నామని మోసగాళ్లు చెప్పారు. చెన్నై అంటే మనకు దగ్గరేకదా అని భావించిన నిరుద్యోగులు ఇంటికి వెళ్లి కొద్దిరోజులు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపి అనంతరం చెన్నైకి వెళ్లారు. అక్కడ రైలు బోగీలు తయారు చేసే ఫ్యాక్టరీలో ట్రైనింగ్ పేరుతో కొద్దిరోజులు ఉంచి, నిరుద్యోగుల సర్టిఫికెట్ల జెరాక్స్‌లు తీసుకొని రైల్వేశాఖ అందించినట్లు అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను మోసగాళ్లు అందజేశారు. ముందుగా మాట్లాడుకున్న విధంగా రూ.24 లక్షలు పూర్తిగా చెల్లించి వెళ్లాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ఇద్దరు పూర్తి నగదు చెల్లించారు. నగదు చెల్లించిన తర్వాత శిక్షణలో మార్పులు కన్పిస్తుండటం, ఢిల్లీలో ఇచ్చిన శిక్షణ అసలు రైల్వే వారు ఇచ్చింది కాదని, తెలుసుకున్న నిరుద్యోగులు తాము మోసపోయామని తెలుసుకున్నారు.