విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సహా పలు డిమాండ్లపై ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు, విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) నేతలకు మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో గురువారం నుంచి జరగాల్సిన నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నటు ప్రభుత్వం, జేఏసీ విడివిడిగా ప్రకటించాయి. ప్రజల కోసం, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలన్న ఉద్దేశంతో, నష్టమే అయినప్పటికీ, అయిష్టంగానే ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించామని, అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన వేతన సవరణవల్ల తమకు ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనమూ కలుగకపోగా, నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకూ నష్టం వాటిల్లుతుందని ఇంజనీర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో జేఏసీ నిర్వహిస్తున్న చర్చలను ఇంజనీర్ల అసోసియేషన్ బాయ్‌కాట్ చేసింది. అయితే.. కార్మిక సంఘాలు ప్రభుత్వంతోనూ .. ఇంధన సంస్థలతోనూ అవగాహన ఒప్పందం చేసుకున్నందున ఇంజనీర్ల సంఘం మాట చెల్లుబాటు కాలేదు. యాజమాన్యానికి, జేఏసీకిమధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై శుక్రవారం అధికారికంగా సంతకాలు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు.