విజయనగరం జిల్లా పాత బొబ్బిలికి చెందిన కర్రి లక్ష్మణ్ సుమారు పది నెలల క్రితం జీవనోపాధి కోసం కుటుంబంతో విశాఖపట్నం నగరానికి వలస వచ్చాడు. మర్రిపాలెం ప్రకాష్‌నగర్‌లోని ప్రకాష్ రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా చేరాడు. భార్య సంధ్య (20), ఎనిమిదేళ్ల కుమారుడు గౌతమ్, ఐదేళ్ల కుమార్తె అలేఖ్యతో అపార్టుమెంట్ సెల్లార్‌లో గల గదిలోనే నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అంతా భోజనం చేసి పడుకున్నారు. రాత్రి సుమారు 11.30 సమయంలో లక్ష్మణ్‌కు మెలకువ వచ్చింది. ఇంట్లో భార్యాపిల్లలు కనిపించలేదు.వెంటనే అపార్టుమెంట్ మొదటి అంతస్థులో నివాసం ఉంటున్న వారికి విషయం తెలిపాడు. వారు కిందకు వచ్చి వెదికారు. సెల్లార్‌లో వున్న సంపు మూత తెరచి ఉండడం గమనించారు. అందులో సంధ్య, గౌతమ్, అలేఖ్య మృతదేహాలు వున్నట్టు గుర్తించి 100కు ఫోన్ చేశారు. రాత్రి గస్తీలో వున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సంపులో ఉన్న ముగ్గురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వెస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అపార్టుమెంట్ వాసులు, మృతుల బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్, సంధ్య అన్యోన్యంగా ఉండే వారని స్థానికులు చెబుతున్నారు. తమ పెద్దమ్మ కుటుంబం వేధింపులే సంధ్య, పిల్లల మృతికి కారణమని ఆమె సోదరుడు ఆరోపిస్తున్నాడు. తన చెల్లి సంధ్యను బొబ్బిలిలో ఉన్నప్పటి నుంచి తమ పెద్దమ్మ, వారి కుమార్తె, వారి అల్లుడు అనుమానిస్తూ వేధించేవారని ఆరోపించాడు. వాటికి తాళలేకే తన చెల్లి పిల్లలతో ఆత్మహత్య చేసుకుందన్నాడు. తల్లి బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటో పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం తెలియజేస్తామని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు.