ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికం పరంగా, విద్యా, మహిళా రక్షణ కోసం చేయగలిగే ప్రతీ పని కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ అక్కచెల్లెమ్మల కోసం మహిళా పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు ముందుకు వేశాడని సగర్వంగా తెలియజేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటా సాధికారతతో ఆవిర్భవించాలని బలంగా నమ్మిన ప్రభుత్వంగా అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం జనుపల్లిలో వరుసగా నాల్గవ ఏడాది వైయస్‌ఆర్ సున్నావడ్డీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,05,13,365 మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో సున్నావడ్డీ నగదు రూ.1,354 కోట్లను జమ చేశారు. ఇప్పటి వరకు సున్నావడ్డీ పథకం ద్వారా ఈ నాలుగేళ్లలో రూ.4,969 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.