ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. పొదుపు సంఘాల మహిళల బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని ఈ నెల 11 (శుక్రవారం) మరో విడత విడుదల చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడత డబ్బుల్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్‌లలోకి విడుదల చేశారు. మొత్తం 9.48 లక్షల డ్వాక్రా గ్రూపుల్లోని మహిలలకు రూ.1358.78 కోట్లను విడుదల చేయనున్నారు.
సున్నా వడ్డీ నిధుల విడుదలకు సంబంధించిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జులై 26న ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది.. కానీ ఈ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును.. అది కూడా గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉన్న రుణాలకు సంబంధించి వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. సకాలంలో రుణాలు చెల్లించే డ్వాక్రా మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు కూడా చేపట్టింది జగన్ సర్కార్
స్వయం సహాయక సంఘాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. ఒక ఏడాదిలో సకాలంలో చెల్లించిన రుణాలకు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుంది. బ్యాంకుల నుంచి గరిష్టంగా ఐదు లక్షల రుణం తీసుకున్న కాదు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. రుణం తీసుకున్న నాటి నుంచి సకాలంలో వాయిదాల చెల్లించిన పొదుపు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలు డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉండాలి.
సకాలంలో వాయిదాలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన సంఘాలు అనర్హులు.. ఐదు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారు అనర్హులు. డ్వాక్రా గ్రూప్ కలిగిన బ్యాంకు ఖాతా పుస్తకం.. ఆధార్ కార్డు, పొదుపు సంఘం రిజిస్టర్ సమర్పించాల్సి ఉంటుంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారు సంబంధిత గ్రామ వార్డు సచివాలయం ప్రదర్శించబడిన అర్హుల జాబితాను వివరంగా పరిశీలించాలి. ఒకవేళ జాబితాలో పేర్లు నమోదుకాకపోతే వెంటనే సమీపంలోని గ్రామ సచివాలయం కానీ వాలంటీర్లకు వివరాలు అందజేయాలి. అలాగే 155251 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.