దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి పాఠశాల విద్యార్థులు కుప్పకూలిపోయారు. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం అయోమయానికి గురైంది. దీంతో హుటాహుటిన అస్వస్థతకు గురైన పిల్లలను సమీపంలో ఉన్న వివిధ ఆస్పత్రులకు తరలించి అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. మొత్తం 24 మంది విద్యార్థులను పలు హాస్పిటల్స్‌కు పంపించి.. మెరుగైన వైద్యం చేస్తున్నారు. అయితే ఈ ఘటన గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నైరుతి ఢిల్లీలోని నారాయణ విహార్ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి చెందిన పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రోజూ లాగానే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఎవరి తరగతి గదుల్లో వారు పాఠాలు వింటున్నారు. ఇంతలోనే అందులోని కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై.. స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు తరలించారు.
మొత్తం 24 మంది విద్యార్థుల్లో 19 మంది విద్యార్థులను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి, మరో 9 మంది విద్యార్థులను ఆచార్య శ్రీ భిక్షు హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని.. ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ పాఠశాలకు సమీపంలో గ్యాస్ లీక్ జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు రంగంలోకి దిగి ఘటనకు కారణాలేంటో విశ్లేషించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.