ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు రూ.6,200 కోట్లు దానం చేసి.. ఫోన్ లేకుండా చిన్న ఇంట్లో జీవనం

national |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 08:56 PM

శ్రీరామ్ గ్రూప్. ఈ పేరు తెలియని వారు ఉండరు. చిట్‌ఫండ్స్, లోన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తోంది. ఆ శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించిన ఆర్ త్యాగరాజన్.. ఆయన పేరుకు తగ్గట్లుగానే త్యాగం చేశారు. తనకు ఉన్న ఆస్తులు రూ. 6,200 కోట్లు.. శ్రీరామ్ గ్రూప్ ఉద్యోగులకు విరాళంగా ఇచ్చేసి.. సాధారణ వ్యక్తిలా జీవనం సాగిస్తున్నారు. అతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన త్యాగరాజన్.. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం తమిళనాడుకు చెందిన ఆర్. త్యాగరాజన్‌ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. శ్రీరామ్ గ్రూప్‌లో అన్ని పదవులనూ వదిలేసిన ఆర్ త్యాగరాజన్.. 86 ఏళ్ల వయసులో ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు. సెల్‌ఫోన్ కూడా లేకుండా.. చిన్న ఇంట్లో.. చిన్న కారు వాడుతూ ఎందరో వ్యాపారస్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగులకు రూ. 6,200 కోట్లు విరాళం ఇచ్చినట్లు స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.


శ్రీరామ్ గ్రూప్‌ మొత్తంలో 1.08 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. శ్రీరామ్ గ్రూప్ మొత్తం ఆస్తుల విలువ రూ. 90 వేల కోట్లు. ఒక్క జులై నెలలోనే శ్రీరామ్ గ్రూప్ లాభం దాదాపు రూ.1600 కోట్లు. ఆ గ్రూప్ అంత విజయవంతంగా మారడం వెనక త్యాగరాజన్ దశాబ్దాల ప్రణాళికలు ఉన్నాయి. పేద ప్రజలకు ట్రక్కులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కొనుగోలు చేసేందుకు లోన్లు ఇచ్చేందుకు ఈ శ్రీరామ్ గ్రూప్ మొదటి స్థానంలో ఉంది. ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని వ్యక్తులకు లోన్లు ఇవ్వడం నష్టమేమీ కాదని నిరూపించేందుకే తాను కంపెనీని ప్రారంభించానని త్యాగరాజన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2006 లో శ్రీరామ్ ఓనర్‌షిప్ ట్రస్ట్‌ను త్యాగరాజన్ నెలకొల్పారు. ఆ తర్వాత తన పూర్తి ఆస్తులను త్యాగరాజన్ శ్రీరామ్ ఓనర్‌షిప్ ట్రస్ట్‌కు బదిలీ చేశారు. దీంతో తన వద్ద ఉన్న రూ. 6200 కోట్ల ఆస్తులను శ్రీరామ్ గ్రూప్ కంపెనీ ఉద్యోగ సంఘాల కోసం విరాళంగా ఇచ్చేశారు. అయితే ఈ విరాళం ఎప్పుడు ఇచ్చారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.


ప్రస్తుతం త్యాగరాజన్ శ్రీరామ్ గ్రూప్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. 86 ఏళ్ల త్యాగరాజన్.. ఇప్పుడు చాలా సాధారణమైన, ప్రశాంత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఎప్పుడైనా బయటికి వెళ్లాలంటే తక్కువ ధరలో చిన్న కారును మాత్రమే ఉపయోగిస్తున్నారు. మొబైల్ కూడా ఉపయోగించకుండా జీవిస్తున్నారు. బిజినెస్ న్యూస్‌పేపర్లు చదువుతూ.. శాస్త్రీయ సంగీతాన్ని వింటూ హాయిగా వృద్ధాప్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీరామ్ గ్రూప్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు తనకు సంబంధం లేదని త్యాగరాజన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. శ్రీరామ్ గ్రూప్ సీనియర్ మేనేజర్లు 15 రోజులకోసారి ఆయనను కలుస్తున్నారు. త్యాగరాజన్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు.


1974 ఏప్రిల్ 5 వ తేదీన తమిళనాడులోని చెన్నైలో ఆర్ త్యాగరాజన్, ఏవీఎస్ రాజా, టీ.జయరామన్ ముగ్గురూ కలిసి శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించారు. మొదట చిట్‌ఫండ్ వ్యాపారంతో ప్రారంభమైన ఈ శ్రీరామ్ గ్రూప్.. ఆ తర్వాత ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వంటి రంగాలకూ విస్తరించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని సామాన్య ప్రజలకు లోన్లు ఇస్తూ.. శ్రీరామ్ గ్రూప్‌ను విస్తరిస్తూ వెళ్లారు. జనాలకు లోన్లు ఇవ్వడం ఒక ఎత్తైతే.. శ్రీరామ్ గ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మరొక ఎత్తు. శ్రీరామ్ పైనాన్స్‌లో పనిచేసేవారి జీతాలు బయటి ఉద్యోగస్తుల జీతాల కంటే 30 శాతం తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ శ్రీరామ్ గ్రూపులో పనిచేసేందుకు చాలా మంది వచ్చేవారని పేర్కొన్నారు. 1937 ఆగస్టు 25 వ తేదీన తమిళనాడులోని ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో ఆర్ త్యాగరాజన్ జన్మించారు. మ్యాథ్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనంతరం 1961లో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో చేరారు. దాదాపు 20 ఏళ్లకుపైగా వివిధ ఫైనాన్స్ కంపెనీల్లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 37 ఏళ్ల వయసులో శ్రీరామ్ గ్రూపును ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీరామ్ గ్రూపులో మొత్తం 30 కంపెనీలు ఉన్నాయి.


అయితే ఆయా కంపెనీలలో పనిచేస్తునపుడు.. జనాలకు వడ్డీలు ఇస్తున్న ఫైనాన్స్ సంస్థల నియమ నిబంధనలు త్యాగరాజన్‌కు నచ్చలేదు. ఒకరికి లోన్ ఇవ్వాలంటే గతంలో లోన్లు ఉన్నాయా.. అతని ఆదాయ వనరులు ఏంటి.. తీసుకున్న లోన్‌ను కట్టగలిగే సామర్థ్యం ఉందా అని ఒకటికి పదిసార్లు ఆలోచించేవని గుర్తు చేసుకున్నారు. దీంతో నిజంగా డబ్బు అవసరం అయినవారికి సహాయం అందకపోయేదని పేర్కొన్నారు. దీంతో త్యాగరాజన్‌కు కొత్త ఆలోచనలు కలిగేలా చేశాయి. ఈ క్రమంలోనే 1974 లో 37ఏళ్ల వయసులో స్నేహితులు, బంధువులతో కలసి శీరామ్ చిట్స్ గ్రూప్‌ను స్థాపించారు. చిట్‌ఫండ్స్ అనే ఈ సామూహిక పొదుపు పథకం బ్యాంకింగ్ వ్యవస్థ తెలియని వారికి ఆ సమయంలో ఎంతో ఉపయోగపడింది. ప్రతీ సభ్యుడు నెలవారీగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ఇలా ప్రతి నెలా సభ్యులందరూ డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఒక వ్యక్తికి ఇస్తారు. అలా చిట్‌ఫండ్స్ పేరుతో చిన్నగా మొదలైన శ్రీరామ్ గ్రూపులో ప్రస్తుతం 30 కంటే ఎక్కువ కంపెనీలుగా విస్తరించింది. బయటి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో వడ్డీరేట్లు 30 నుంచి 35 శాతం ఉండగా.. శ్రీరామ్ ఫైనాన్స్‌లో కేవలం 17 నుంచి 18 శాతంతో లోన్లు ఇచ్చేవారు. ఇలా తీసుకున్న 98 శాతం సభ్యుల నుంచి సమయానికి డబ్బులు వసూలు చేయడం ఆ సంస్థ విస్తరణ, విజయానికి కారణం. అందుకే జనాలకు ఫైనాన్స్ ఇవ్వడం.. ఇచ్చిన ఫైనాన్స్ డబ్బును సమయానికి వసూలు చేయడంతో శ్రీరామ్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం శ్రీరామ్ పైనాన్స్ 2.3 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com