విశాఖ ప్రజలకు టీటీడీ శుభవార్త అందించింది. ఇక నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదం స్థానికంగా లభించనుంది. భక్తుల కోసం విశాఖలోని రుషికొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని విక్రయించాలని తాజాగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా రెండో శనివారం మాత్రమే ఆ దేవాలయంలో తిరుమల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. తిరుమల లడ్డూలను విక్రయించేందుకు రుషికొండ వెంకటేశ్వరస్వామి టెంఫుల్ వద్ద ఒక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌంటర్‌లో రూ.50తో పాటు రూ.200ల లడ్డూలను కూడా విక్రయించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. విశాఖ ప్రజలకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో టీటీడీ అధ్వర్యంలో నడిచే శ్రీవారి ఆలయాల్లో కూడా భక్తుల కోసం ప్రసాదాలను అందుబాటులో తెస్తున్నారు. తిరుమలలో తయారుచేస్తున్న లడ్డూలను ఇక్కడకు తీసుకొచ్చి భక్తులకు విక్రయిస్తున్నారు. శ్రీవారి లడ్డూలకు ఉన్న ప్రాచుర్యం దృష్టా తిరుమలలోనే కాకుండా ప్రధాన సిటీలలో విక్రయించాలని టీటీడీ చూస్తోంది.
విజయవాడలో ఎప్పటినుంచో లడ్డూలను టీటీడీ విక్రయిస్తోంది. విజయవాడ సిటీలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ప్రతి శనివారం విక్రయిస్తోంది. ఇక హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కళ్యాణమండపంలో కూడా ఎప్పటినుంచో తిరుమల లడ్డూలను విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రధాన నగరమైన విశాఖలో కూడా లడ్డూలను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయంలో విశాఖలోని శ్రీవారి భక్తులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోనే తమకు శ్రీవారి లడ్డూలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే లాక్‌డౌన్ సమయంలో తిరుమలలో భక్తుల దర్శనాన్ని నిలిపివేయడంతో ఏపీలోని అన్ని జిల్లాల్లో శ్రీవారి లడ్డూలను విక్రయించారు. ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాల్లో భక్తులకు సగం ధరకే లడ్డూలను అందుబాటులో ఉంచారు. రూ.50 లడ్డును రూ.25కి అందించారు. అలాగే చెన్నై, బెంగళూరులో ఉన్న టీటీడీ కల్యాణ మండపాల్లో కూడా లడ్డూలను శ్రీవారి భక్తుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలని జగన్ సర్కార్ చూస్తోంది. దసరా నుంచి విశాఖలోనే జగన్ నివాసం ఉండనున్నారు. ఇప్పటికే రుషికొండపై క్యాంప్ ఆఫీస్‌తో పాటు జగన్ ఉండేందుకు కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు.